Monday, September 20, 2010

శాశ్వత ముంపునివారణకు కార్యాచరణ ప్రణాళిక

పశ్చిమ డెల్టా ప్రాంతంలో శాశ్వత ముంపు నివారణ చర్యలు చేపట్టేందుకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రాష్ర్ట భారీ నీటీ పారుదల శాఖామంత్రి పొన్నాల లక్ష్మయ్య అధికారులను ఆదేశించారు. పాలకొల్లు, భీమవరం, ఉండి నియోజక వర్గాల్లో వివిధ కాల్వలు, లాకుల పరిస్ధితిని ఆదివారం మంత్రి పొన్నాల లక్ష్మయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెల్టా ప్రాంతంలో పది లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతున్నదని ఆయితే వరదలు భారీ వర్షాలు సమయంలో తరచూ ముంపునకు గురవుతున్నాయన్నారు. ఈ సమాయాలలో నివాస ప్రాంతాలు, పంటలు జలమయమై నష్టం వాటిల్లుతున్నదన్నారు.
ఈ ముంపు నుంచి రక్షించేందుకు శాశ్వత ముంపు నివారణ కార్యాచరణ రూపొందిస్తామని ఇందుకోసం ప్రత్యేకంగా కన్సల్‌టెంట్‌ను నియమించనున్నామన్నా. ఇందుకు సంబంధించి నెలలోగా సమగ్ర నివేదిక అందజేయాలని నీటిపారుదల శాఖ సూపరింటెండింగ్‌ ఇంజనీరును మంత్రి ఆదేశించారు. సర్‌ఆర్ధర్‌ కాటన్‌ మహాశయుడు 150 సంవతవ్సరాల క్రితం నిర్మించిన నేటి డ్రైన్‌లు, పంటకాల్వలు ద్వారా ఎంతో ప్రయోజనం పొందామన్నారు. అయితే కాల క్రమేణా వ్యవసాయానికి అనుకూలంగా వీటిని ఆధునీకరణ చేయవలసి ఉందన్నారు. రాష్ట్రానికి పోలవరం ప్రాజెక్టు ఒక వరం లాంటిదని పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. ఎన్ని సమస్యలు, అవాంతరాలు ఎదురైనా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. పేద రైతుల పాలిట ఈ ప్రాజెక్టు కల్పవృక్షం లాంటిదన్నారు. వృధాగా పోయే నీరును బీడు భూములకు మళ్లించడమే ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఎటువంటి అభ్యంతరాలు లేవని, చిన్న చిన్న అభ్యంతరాలు ఉన్నా అవి సమసిపోగలవని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారీ నీటి పారుదల శాఖామంత్రి తొలుత యలమంచిలి మండలం లక్ష్మీపాలెం, నక్కల ఔట్‌ఫాల్‌ స్లూయిజ్‌ను పరిశీలించారు.

వై.వి.లంక దగ్గర కాల డ్రైయిన్‌ను పరిశీలించి పాడైన షట్టర్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉండి ఎండగండి లాకులను పొన్నాల లక్ష్మయ్య పరిశీలించారు. అవసరమైన మరమ్మతులకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట నరసాపురం పార్లమెంట్‌సభ్యులు కనుమూరి బాపిరాజు, జిల్లా పరిషత్తు ఛైర్మన్‌ మేకా శేషుబాబు, శాసనసభ్యులు ముదునూరి ప్రసాదరాజు, బంగారు ఉషారాణి, పులపర్తి రామాంజనేయులు, ఉండి శాసనసభ్యులు కలవపూడి శివ, ప్రాజెక్టు కమిటీ ఛైర్మన్‌ పండురాజు, యలమంచిలి ఎంపిపి చిలుకూరి బాపిరాజు, నీటిపారుదల శాఖ ఇన్‌ఛార్జి ఎస్‌.ఇ చంద్రరావు, ఆర్‌డివో ఎస్‌.వెంకట సుబ్బయ్య, ప్రభృతులు పాల్గొన్నారు.

ఔను తప్పే చేశాం

  ఎట్టకేలకు ప్రతీ ఏటా జరుగుతున్న పంట నష్టంపై ప్రభుత్వపరంగా మేజర్ ఇరిగేషన్ శాఖామంత్రి ఒప్పుకోలు ప్రకటన చేశారు. ఇకముందు ఇలాంటి పరిస్థితి రాదంటూ పశ్చిమ రైతులకు ఒక భరోసా ఇచ్చారు. జలయజ్ఞం పేరిట పెద్ద ప్రాజెక్టులు నిర్మాణమే కాదు క్షేత్ర స్థాయిలో పెండింగ్‌లో ఉన్న ఇరిగేషన్ పనులను పూర్తిచేస్తే రైతులు నష్టపోరని, ప్రతీ ఏటా ముంపు సమస్యలు తలెత్తబోదని నేరుగానే ఆయన ఒప్పుకున్నారు. ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని డెల్టా ప్రాంతంలో ఆయన విస్తృతంగా పర్యటించారు.

ఈ పర్యటన సందర్బంగా ముంపునకు గురైన పంట పొలాలను చూసి దీనికి కారణమైన ఇరిగేషన్ నిర్లక్ష్యం చూసి ఆయన ఒకింత ఆశ్చర్యపోయారు. క్షేత్ర స్థాయిలో ఇలా జరుగుతుందా అంటూ నివ్వెరపోయారు. జలయజ్ఞం పేరిట పెద్ద ప్రాజెక్టుల మీదే దృష్టి పెట్టి క్షేత్రస్థాయిలో కొన్ని పనులను నిర్లక్ష్యం చేశామని, ఫలితంగానే ఈ నష్టం వాటిల్లినట్టు నిజాయితీగా ఒప్పుకున్నారు. వాస్తవానికి మేజర్ ఇరిగేషన్ శాఖామంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆదివారం పర్యటించిన ప్రాంతాలన్నింటిలోనూ దాదాపు 20 వేల ఎకరాల్లో పంట నీట మునిగింది.

రైతులు భారీగా నష్టపోయారు. ఈ నష్టానికి గల కారణాలను ఆయన స్వయంగా తెలుసుకుని నోరెళ్ళబెట్టారు. జిల్లాల్లో ఈ విధంగా నష్టం జరుగుతుందా అంటూ ఆశ్చర్యార్ధకంతో ముఖం పెట్టారు. ఇకముందు అలా జరగదంటూ పదేపదే చెప్పుకుంటూ పర్యటన పూర్తి చేసుకున్నారు. యలమంచిలి మండలంలో నక్కల స్లూయిజ్‌ను పరిశీలించిన ఈ క్రమంలో ఇక్కడ గేట్ల నిర్మాణంలో జరిగిన జాప్యం ఫలితంగానే 17 వేల ఎకరాల్లో పంట నీట మునిగిన వాస్తవానికి మంత్రికి దగ్గరుండి స్థానిక నేతలు చూపించారు. ఈ గేట్లను నిర్మించాల్సిందిగా చాలా కాలం నుంచి తామూ, రైతులు కోరుతున్నామని, అయినా ప్రతిస్పందన లేని కారణంగానే ఈసారి కూడా వేలాది ఎకరాల్లో పంట నీటిపాలైందని, రైతులు భారీగా నష్టపోయారంటూ ఏకరువు పెట్టారు.

దీంతో మంత్రి పొన్నాల కూడా చలించిపోయారు. తప్పిదాన్ని ఒప్పుకున్నారు. రాబోయే మూడు నెలల వ్యవధిలోనే ఈ తరహా పనులపై ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించి పూర్తి చేస్తామంటూ హామీ ఇచ్చారు. ఇంతకుముందెన్నడూ లేని విధంగా క్షేత్ర స్థాయిలో ముంపునకు గురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ పెడతామని కూడా చెప్పుకొచ్చారు. చిన్నాచితక పనులను చూసీచూడనట్టుగా వదిలేసిన ఫలితంగానే ఇలాంటి అవాంతరం, నష్టం తలెత్తిందని, ఈ ఫలితాలు ఇక ఉండబోవంటూ స్పష్టం చేశారు. సాధ్యమైనంత మేర స్వల్పకాలిక వ్యవధిలోనే ఈ తరహా ముంపునకు గురైన ప్రాంతాల్లో నివారణ మార్గాలను అన్వేషించి ఆ మేరకు నిధులు కూడా కేటాయిస్తామని పొన్నాల లక్ష్మయ్య నేరుగానే భరోసా ఇచ్చారు.

యలమంచిలి నుంచి భీమవరం వరకు ఆయన ఆదివారం పర్యటించారు. చాలా ప్రాంతాల్లో ఆయన ముంపునకు గురైన ప్రాంతాలను చూసి నివ్వెరపోయారు. ముంపుకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను స్థానిక అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఇకముందు ఇలాంటి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటామంటూ పదేపదే చెప్పుకుంటూ వచ్చారు. ఇదే క్రమంలో ఇప్పటిదాకా జలయజ్ఞం పేరిట భారీ ప్రాజెక్టు నిర్మాణానికే ప్రాధాన్యత ఇస్తూ వచ్చామే తప్ప పంట నష్టాన్ని నివారించే క్రమంలో చిన్నాచితక పనులపై దృష్టి పెట్టలేకపోయామంటూ ఆవేదన కూడా వ్యక్తం చేయడం ఈసారి మేజర్ ఇరిగేషన్‌శాఖామంత్రి పర్యటనలో ఓ పెద్ద హైలెట్. అయినప్పటికి ఇంతకుముందు మూడు నెలల క్రితం డెల్టా ప్రాంతంలోనే పర్యటించారు.

ఈ సందర్భంగా రైతులు పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పెండింగ్ పనులు పూర్తి చేయాల్సిందిగా పదేపదే అభ్యర్ధించారు. వీటికి నిధులు కేటాయించాలని కూడా డిమాండ్ చేశారు. అప్పట్లో అన్నీచేసేస్తామన్న మంత్రి ఇప్పటిదాకా ఆ మాట నిలుపుకోలేకపోయారు. తాజాగా వచ్చిన వరదలు, భారీ వర్షాల దెబ్బతో జిల్లాలో వేలాది ఎకరాల్లో పంట దెబ్బతిన్న పరిణామాల నేపథ్యంలో మంత్రి తమ శాఖాపరమైన తప్పిదాలను ఒప్పుకుంటూనే తక్షణ చర్యలకు ఉపక్రమించడం విశేషం.

No comments:

Post a Comment

కనుమూరి బాపిరాజు

Y.S . Rajasekhara Reddy